వేమననగ యోగి వెలసె లోకములోన
బూజలిడుడు పుణ్య పురుషులార
పూజలిడిన యంత భుక్తి ముక్తుల నిచ్చు
విశ్వధాభిరామ వినర వేమ (1)
పలుకమన్న నేల పలుకక యున్నావు
పలుకుమయ్య నాతో ప్రబలముగను
పలుకమయ్య! నీదు పలుకు నేనెఱిగెదె
విశ్వధాభిరామ వినర వేమ (2)
ఆతమశుద్ధిలేని యాచారమది యేల
భాండ శుద్ధిలేని పాక మేల
చిత్త శుద్ధిలేని శివపూజ లేలరా
విశ్వధాభిరామ వినర వేమ (3)
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల
చదవ బద్య మరయ జాలద యొక్కటి
విశ్వధాభిరామ వినర వేమ (4)
నిన్ను జూచె నేని తన్ను దామఱచును
తన్ను జూచె నేని నిన్ను మఱచు
నే విధమున జనుడు నెఱుగు నిన్నును దన్ను
విశ్వధాభిరామ వినర వేమ (5)
మరియు వాడెవడు మురియని దెవ్వడు
పాటు జేసి చూడ బట్త బయలు
సారది జల ఘటమున సూర్యుని చందంబు
విశ్వధాభిరామ వినర వేమ (6)
గాజు కుప్పెలోన కడగుచు దీపంబు
యెట్టు లుండు, ఙాన మట్టు లుండూ
దెలిచినట్టి వారి దేహంబు లందును
విశ్వధాభిరామ వినర వేమ (7)
కల్ల గురుడు గట్టు నెల్ల కర్మంబుల
మద్య గురుడు గట్టు మంత్ర చయము
నుత్తముండు కట్టు, యోగ సామ్రాజ్యంబు
విశ్వధాభిరామ వినర వేమ (8)
పెట్టి పోయలేని వట్టి నరుల భూమి
పుట్టనేమి? వారు గిట్టనేమి?
పుట్టలోన జెదలు పుట్టదా గిట్టదా?
విశ్వధాభిరామ వినర వేమ (9)
తాము గన్న వారు తము గన్నవారును
చచ్చుటెల్ల, తమకు సాక్షిగాదె?
బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా?
విశ్వధాభిరామ వినర వేమ (10)